Thursday, May 21, 17:02
41.2 C
Hyderabad

Big Breaking : పీఓకేలో బుల్లెట్ల వర్షం.. ‘పుల్వామా’ సూత్రదారి హంజా బుర్హాన్ హతం

Pulwama-mastermind-Hamza Burhan killed
Pulwama-mastermind-Hamza Burhan killed

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) వేదికగా భారతదేశానికి వ్యతిరేకంగా నిరంతరం ఉగ్ర కుట్రలు పన్నుతున్న దేశద్రోహ శక్తులకు, ఉగ్రవాద నెట్‌వర్క్‌కు మరో కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019లో యావత్ భారతదేశాన్ని వణికించిన పుల్వామా ఘోర ఉగ్రదాడి వెనుక ఉండి నడిపించిన ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అర్జుమండ్ గుల్జార్ దార్ అలియాస్ ‘హంజా బుర్హాన్’ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK) లోని ముజఫరాబాద్‌లో హతమయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన మెరుపు కాల్పుల్లో ఈ టాప్ ఉగ్రవాద కమాండర్ మరణించినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా మారిన పీఓకేలోని ముజఫరాబాద్‌లో సంచరిస్తున్న హంజా బుర్హాన్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. అతడు అప్రమత్తమై తప్పించుకునే లోపే మారణాయుధాలతో అతడిపై పలు రౌండ్లు బుల్లెట్ల వర్షం కురిపించారు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆ టాప్ టెర్రరిస్ట్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడంలో కీలక పాత్ర పోషించిన ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మరణం ఉగ్ర సంస్థలకు కోలుకోలేని దెబ్బ.

2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆనాడు జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్, పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చి సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. అయితే ఈ ఘాతుకానికి కేవలం ఆత్మాహుతి దాడి చేసిన వాడే కాకుండా, వెనుక ఉండి పూర్తి నెట్‌వర్క్ నడిపించడంలో, వ్యూహాలు రచించడంలో ‘అల్-బద్ర్’ ఉగ్రవాద సంస్థ అసోసియేట్ మెంబర్, కమాండర్ అయిన హంజా బుర్హాన్ అత్యంత కీలక పాత్ర పోషించాడని భారత నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. నాటి నుంచి ఇతడు భారత భద్రతా దళాల హిట్ లిస్టులో ఉన్నాడు.

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా రత్నీపోరా ప్రాంతానికి చెందిన హంజా బుర్హాన్, చాలా కాలంగా అల్-బద్ర్ ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్‌గా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చాడు. లోయలోని స్థానిక యువతను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లించడంతో పాటు, భద్రతా దళాలే లక్ష్యంగా అనేక విధ్వంసకర దాడులకు ప్రణాళికలు రచించాడు. దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారిన ఇతడి క్రిమినల్ రికార్డు, ఉగ్ర కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన భారత ప్రభుత్వం.. 2022లోనే బుర్హాన్‌ను అధికారికంగా ‘ఉగ్రవాది’గా ప్రకటించి మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది.

మన జవాన్ల వీరమరణానికి కారణమైన ఉగ్ర రక్కసి హతమయ్యాడనే వార్త తెలియడంతో భారతదేశంలో సంబురాలు అంబురాన్ని అంటాయి. పుల్వామా దాడి జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఆనాడు దేశానికి జరిగిన అన్యాయానికి, అమరులైన సైనికుల త్యాగానికి ప్రకృతి రూపంలోనైనా న్యాయం జరిగిందని రక్షణ వర్గాలు మరియు దేశ ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు ఈ వార్త కొంతైనా ఊరటనిచ్చింది.

గత కొంతకాలంగా భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ, పాకిస్తాన్ రక్షణలో పీఓకే సరిహద్దుల్లో తలదాచుకుంటున్న పలువురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వరుసగా ఇలాగే గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతుండటం గమనార్హం. సరిహద్దు అవతల ఆశ్రయం పొందుతున్న భారత శత్రువులకు ఈ వరుస ఘటనలు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి.