Thursday, May 21, 17:00
41.2 C
Hyderabad

Mysuru Road Rage Horror: మైసూరులో దారుణం… అప్పు అడిగినందుకు కారు బోనెట్‌పై 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం!

Man dragged on car bonnet
Man dragged on car bonnet

Mysuru Road Rage Horror : డబ్బుల గొడవ కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిని కారు బోనెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరంగా ఈడ్చుకెళ్లిన దిగ్భ్రాంతికర సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. మైసూరుకు చెందిన మహాదేవ్ అనే వ్యక్తి, ధనుంజయ్ అనే మరో వ్యక్తికి కొంతకాలం క్రితం డబ్బును అప్పుగా ఇచ్చాడు. అయితే ఎంతకాలమైనా ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో, మహాదేవ్ తన బకాయిలను చెల్లించాలని ధనుంజయ్‌ను గట్టిగా నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.మహాదేవ్ ఒత్తిడి తట్టుకోలేక ధనుంజయ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే తన కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. ధనుంజయ్ పారిపోకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మహాదేవ్ క్షణికావేశంలో ఆ కారు బోనెట్‌పైకి ఎక్కాడు. అయినా సరే ధనుంజయ్‌లో ఎలాంటి చలనం రాలేదు. కారు ఆపకపోగా.. బోనెట్‌పై మనిషి ఉన్నాడనే కనీస మానవత్వం లేకుండా కారును అత్యంత వేగంగా ముందుకు పోనిచ్చాడు.

కారు వేగంగా దూసుకుపోతుండటంతో మహాదేవ్ ప్రాణభయంతో బోనెట్‌ను గట్టిగా పట్టుకుని వేలాడాడు. అలా సుమారు అర కిలోమీటరు (500 మీటర్లు) దూరం మహాదేవ్‌ను ధనుంజయ్ కారుపైనే ఈడ్చుకెళ్లాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఈ ఘోరాన్ని చూసి కేకలు వేస్తూ, కారును వెంబడించడంతో ధనుంజయ్ చివరకు వాహనాన్ని ఆపాడు. ఈ రోమాంచిత దృశ్యాలను అక్కడి వారు కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం డబ్బుల గొడవ కోసం ఒక మనిషి ప్రాణాలను అంతలా పణంగా పెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.