Thursday, May 21, 16:32
41.2 C
Hyderabad

Medak Fire Accident : మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. నడిరోడ్డుపై ఎనిమిది కార్లు దగ్ధం

Tupran Lorry Container Fire Incident
Tupran Lorry Container Fire Incident

Medak Fire Accident : మెదక్ జిల్లాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి (NH-44) పై ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. మహారాష్ట్ర వైపు నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఈ కంటైనర్ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు కంటైనర్ లారీలో కొత్తగా విక్రయానికి తరలిస్తున్న 8 మారుతీ సుజుకి కార్లు ఉన్నాయి. మంటలు క్షణాల్లో కంటైనర్ అంతటా విస్తరించడంతో, అందులోని ఎనిమిది కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. లారీలో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదం కారణంగా జాతీయ రహదారి (NH-44) పై హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అయితే, మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం క్రేన్ల సహాయంతో రోడ్డుపై ఉన్న లారీ శిథిలాలను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.