
రైలు ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రైల్వే బోర్డు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్స్ భద్రతను దృష్టిలో ఉంచుకొని, రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను పూర్తిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
తాజా నిబంధనల ప్రకారం.. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు (మొత్తం 6 గంటల పాటు) రైలు కోచ్‌లలో ఉండే మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు అన్నింటినీ తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలి. ఇటీవల ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణికుడు ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా పవర్ బ్యాంక్ పేలిపోయింది. ఆ బ్లాస్ట్‌తో బోగీ అంతా దట్టమైన పొగ అలుముకుని తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రమాదం తర్వాత రైల్వేశాఖ వెంటనే అప్రమత్తమైంది.
సాధారణంగా రాత్రి సమయాల్లో ప్యాసింజర్స్ గాఢ నిద్రలో ఉంటారు. ఆ టైమ్‌లో గ్యాడ్జెట్స్ ఎక్కువసేపు ప్లగ్ చేసి ఉంచడం వల్ల ఓవర్‌హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ జరిగితే త్వరగా గుర్తించడం కష్టం. ఇది క్షణాల్లోనే పెద్ద అగ్నిప్రమాదాలకు దారితీసే రిస్క్ ఉంది. ఈ పెను ప్రమాదాలను అరికట్టేందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ నైట్ ఛార్జింగ్ బ్యాన్ తీసుకొచ్చారు.
నిజానికి రాత్రి పూట ఛార్జింగ్‌పై ఆంక్షలు 2014 నుంచే ఉన్నప్పటికీ, చాలాచోట్ల ఇది సరిగ్గా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే తాజా ముంబయి ఘటనతో బోర్డు ఈసారి రూల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. సమయానికి కరెక్ట్‌గా ఛార్జింగ్ పాయింట్లు ఆఫ్ చేసేలా గ్రౌండ్ లెవెల్ సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని జోన్లకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తేల్చిచెప్పింది. సేఫ్టీ మెజర్స్‌లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించింది. కాబట్టి ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు రాత్రి 11 గంటల లోపే తమ ఫోన్లు, పవర్ బ్యాంకులు ఛార్జ్ చేసుకోవడం మంచిది.









