
Karumuri Sunil : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంచలన మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, వైసీపీ యువ నేత కారుమూరి సునీల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నగరంలోని ఆయన నివాసంలో ఇటీవల తనిఖీలు చేపట్టిన అధికారులు, పలు కీలక పత్రాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు తర్వాత ఆయన్ను తదుపరి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుండి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సునీల్, హవాలా ఆరోపణలతో ఈడీకి దొరకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ భారీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, ముప్పిడి అవినాశ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, పైల దిలీప్, సైఫ్ అహ్మద్ వంటి నిందితులు సిండికేట్‌గా ఏర్పడి కిక్‌బ్యాక్స్ రూపంలో ఏకంగా రూ.3,500 కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ సొమ్ముతో వారు పలు డిస్టిలరీలను స్థాపించడమే కాకుండా, మద్యం తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ వస్తువుల సరఫరా పేరిట నకిలీ విక్రేతలను సృష్టించారు. ఎలాంటి వస్తువులూ సరఫరా చేయకుండానే బోగస్ ఇన్‌వాయిస్‌లు తయారు చేసి, బ్యాంకింగ్ నిధులను లెక్కల్లో లేని నల్లధనంగా మార్చేశారు.
ఇలా వచ్చిన అక్రమ ఆదాయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భారీగా భూములు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఒల్విక్, క్రిపతి, నైస్నా మల్టీవెంచర్స్, అరోయో, డీ-కార్ట్ వంటి పలు షెల్ కంపెనీల (Shell Entities) ద్వారా నిధులను వివిధ పొరలుగా (Layering) మళ్లించి, నెలకు దాదాపు రూ.100 కోట్ల వరకు అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది. ఈ విచారణలో భాగంగా మొత్తం రూ.1,048.45 కోట్ల మనీ ట్రయల్‌ను ఈడీ అధికారులు పక్కాగా గుర్తించారు. నగదు, బంగారం రూపంలో ఉన్న ఈ కిక్‌బ్యాక్‌లను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాచినట్లు, హ్యాండ్లర్ల ద్వారా ఈ నగదును రవాణా చేసినట్లు ఆధారాలు లభించడంతో, ఈ సిండికేట్‌కు చెందిన రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.
ఇదే కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డితో పాటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు యువ నేతలు వేర్వేరు వివాదాల్లో చిక్కుకోవడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన పుట్టా మహేశ్ యాదవ్ గతంలో హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ ఉదంతంలో పట్టుబడగా, అదే స్థానం నుండి పోటీ చేసి ఓడిన వైసీపీ నేత కారుమూరి సునీల్ ఇప్పుడు హవాలా, మద్యం స్కామ్ కేసులో ఈడీ చేతికి చిక్కడం గమనార్హం.









