Tirumala
Tirumala

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అప్‌డేట్ తెలిపింది. వేసవి సెలవుల రద్దీని తట్టుకోవడానికి గత కొన్ని వారాలుగా దర్శన టోకెన్ల జారీ సమయాల్లో చేసిన తాత్కాలిక మార్పులను టీటీడీ ఇప్పుడు రద్దు చేసింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రాక సాధారణ స్థితికి చేరుకోవడంతో, టోకెన్ల జారీ ప్రక్రియను మళ్లీ పాత పద్ధతిలోనే సాధారణ సమయాలకు మారుస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని వారాల క్రితం వేసవి సెలవుల కారణంగా తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుపతిలోని టోకెన్ కౌంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా రద్దీని నియంత్రించడం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అర్ధరాత్రి సమయంలోనే టోకెన్లను జారీ చేసే తాత్కాలిక విధానాన్ని అమలు చేసింది. అయితే ఇప్పుడు సెలవులు ముగిసి భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది.

ఈ క్రమంలో టీటీడీ నేటి నుంచి దర్శన టోకెన్ల జారీని మళ్లీ పాత సమయాలకే మార్చింది. ఇకపై ప్రతిరోజూ మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు మాత్రమే ఈ దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. తిరుమల వెళ్లే సామాన్య భక్తులు ఈ సమయాలను గుర్తుంచుకుని ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. ఈ టోకెన్లను తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేయనున్నారు. అయితే వీటిని నిర్ణీత సమయాల్లో మాత్రమే కౌంటర్ల వద్ద ఇస్తారు. టోకెన్ కేంద్రాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని టీటీడీ తెలిపింది. బయోమెట్రిక్ లేదా గుర్తింపు ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే భక్తులకు కౌంటర్లలో దర్శన టోకెన్లు ఇస్తారు. భక్తుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మార్పులను భక్తులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.