BCCI

BCCI  :  ఇంగ్లండ్ పర్యటన కోసం భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. అయితే, అతను ఈ సిరీస్ ఆడటం అనేది పూర్తిగా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. సోమవారం బెంగళూరులో జరిగే కీలకమైన ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. అందులో పాస్ అయితేనే అతను ఇంగ్లండ్ విమానం ఎక్కనున్నాడు.

ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. అలాగే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఈ జట్టులో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వికెట్ కీపర్లుగా కె.ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు జట్టులోకి వచ్చారు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జూలై 14న ఎడ్జ్‌బాస్టన్‌లో, రెండో వన్డే జూలై 16న సోఫియా గార్డెన్స్‌లో, చివరి వన్డే జూలై 19న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్నాయి.

ఇంగ్లండ్ పర్యటనకు భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్‌నెస్‌ను బట్టి), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె.ఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

ఇదే సమయంలో ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఒక మార్పు చేసింది. ఐపీఎల్ 2026 లో ఎడమ కాలికైన గాయం కారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. అతని స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇటీవలే లంక-ఎ జట్టుపై 29 బంతుల్లో 94 పరుగులు చేసి సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఈ టీ20 జట్టులో కొనసాగుతున్నాడు.

ఐర్లాండ్ సిరీస్‌కు అప్‌డేట్ చేసిన టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.