
China : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉండే వైట్‌హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక పాత భవనాన్ని చైనాకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైనాలోని అధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న ఫిలిప్ కియు అనే వ్యక్తి, తన ఫ్యామిలీ సంస్థ ద్వారా వాషింగ్టన్‌లోని ఒక భవనాన్ని దాదాపు 84 లక్షల డాలర్లకు కొన్నారు. జూలై 2026లోనే ఈ భవనం కొనుగోలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. వైట్‌హౌస్‌కు ఇంత దగ్గరగా భవనం కొనడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read : ఒకే నంబర్‌తో ఒకే రూట్లో రెండు విమానాలు.. ఆమెరికాలో తప్పిన ఘోర ప్రమాదం!
ఇంతకు ఎవరీ ఫిలిప్ కియు?
ఫిలిప్ కియు గతంలో చైనాలోని షాంఘై పోలీసు శాఖలో పనిచేశారు. ఇది చైనా ప్రభుత్వ హోంశాఖ కింద పనిచేస్తుంది. ఆయనకు తుపాకీతో లక్ష్యాలను ఖచ్చితంగా కాల్చే స్నైపర్ శిక్షణతో పాటు ఆర్మీ తరహా ప్రత్యేక పోరాట శిక్షణ కూడా ఉంది. 2011లో జరిగిన ఒక ఆర్మీ పోటీలో ఆయన అత్యుత్తమ స్నైపర్‌గా రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆయన నడుపుతున్న సంస్థకు చైనా నిఘా విభాగంతో సంబంధాలు ఉన్నాయని అమెరికా మీడియా పేర్కొంది.
వైట్‌హౌస్‌కు చాలా దగ్గరగా ఉన్న భవనం నుంచి అమెరికా ప్రభుత్వ రహస్య సంభాషణలను వినడానికి లేదా ఎలక్ట్రానిక్ పరికరాలతో నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుందని అమెరికా మాజీ నిఘా అధికారులు భయపడుతున్నారు. వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
మరోవైపు భారత నిఘా వర్గాలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా నేరుగా యుద్ధం చేయకుండా, ఇలా వేరే దేశాల్లో ఆస్తులు, వ్యాపారాలు కొంటూ మెల్లగా తన ప్రభావాన్ని పెంచుకునే వ్యూహాన్ని వాడుతోందని తెలిపాయి.
చైనాకు చెందిన వ్యక్తులు అమెరికా సైనిక స్థావరాల దగ్గర ఆస్తులు కొనడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా టెక్సాస్, నార్త్ డకోటాలోని అమెరికా ఆర్మీ బేస్‌ల దగ్గర భూములు కొనడంపై పెద్ద గొడవైంది. ఇప్పుడు నేరుగా వైట్‌హౌస్ పక్కనే భవనం కొనడం అమెరికా భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.









