
Ayatollah Ali Khamenei : పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో అత్యంత భారీ చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో మృతిచెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు) అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకలకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆహ్వానంపై భారత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గత ఫిబ్రవరిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో 86 ఏళ్ల అలీ ఖమేనీతో పాటు మరో 40 మంది అత్యున్నత సైనికాధికారులు మరణించారు. ఈ దాడిలో ఖమేనీ కుటుంబానికి చెందిన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఖననం చేయాల్సి ఉన్నప్పటికీ, అప్పట్లో నెలకొన్న తీవ్ర యుద్ధ పరిస్థితులు, ప్రాంతీయ ఘర్షణలు మరియు దేశ రక్షణ కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఈ అంత్యక్రియలను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.
యుద్ధ వాతావరణం సద్దుమణగడంతో ‘ది కమిటీ ఫర్ ది కామెమొరటైన్ అఫ్ ది అసెన్షన్ అఫ్ ది ముజాహిద్ మార్టిర్ ఇమాం’ ఎట్టకేలకు అధికారిక అంత్యక్రియల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. జూలై 4 నుంచి జూలై 9 వరకు ఐదు రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ అధికారిక వీడ్కోలు కార్యక్రమాలు అత్యంత భారీ స్థాయిలో జరగనున్నాయి. జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత జూలై 6న టెహ్రాన్ నగరంలో భారీ అంత్యక్రియల ఊరేగింపు సాగనుంది.
అనంతరం జూలై 7న టెహ్రాన్ దక్షిణాన ఉన్న పవిత్ర నగరం ‘ఖోమ్’లో ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపు నిర్వహిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇమామ్ సజ్జాద్ అమరత్వ దినానికి ముందు రోజైన జూలై 9న ఖమేనీ స్వస్థలమైన ఈశాన్య ఇరాన్ పవిత్ర నగరం మషాద్‌లో తుది అంత్యక్రియలు జరగనున్నాయి. మషాద్‌లోని ప్రసిద్ధ ఇమామ్ రెజా మందిరం వద్ద ఖమేనీ ఖననంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఖమేనీతో పాటు దాడుల్లో మరణించిన ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ మిస్బా అల్-హుదా బఖేరీ కనీ, సయ్యిదా బుష్రా హోస్సేనీ ఖమేనీ, జహ్రా హద్దాద్ అడెల్, జహ్రా మొహమ్మది గోల్పాయెగానిలను కూడా ఇదే వేడుకల్లో ఖననం చేయనున్నారు.
1989లో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహొల్లా ఖొమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన అలీ ఖమేనీ, దాదాపు 35 ఏళ్లపాటు ఇరాన్ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. ఆయన అంతిమ యాత్రకు టెహ్రాన్, ఖోమ్, మషాద్ నగరాల్లో కలిపి దాదాపు 2 కోట్ల (20 మిలియన్ల) మంది జనం తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే, 1989లో రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు హాజరైన కోటి మంది రికార్డు బద్దలు కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు పలు దేశాల అగ్రనేతలు హాజరుకానున్నారు.
మరోవైపు ఇరాన్ అంతర్గత రాజకీయాలు, నూతన నాయకత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమేనీ మరణానంతరం మార్చి 4న ఆయన 56 ఏళ్ల కుమారుడు మొజ్తబా హొస్సేని ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఫిబ్రవరి నాటి దాడుల్లో గాయపడిన మొజ్తబా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ‘కోమా’లో ఉన్నట్లు అమెరికా సీనియర్ అధికారులు మార్కో రూబియో, పీట్ హెగ్‌సెత్‌లు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై ఇరాన్ అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్రిక్తతలకు, ప్రపంచాన్ని ముంచెత్తిన తీవ్ర ఇంధన, శక్తి సంక్షోభానికి (Global Fuel Crunch) తెరదించుతూ ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌లు విడివిడిగా డిజిటల్ వ్యూహాత్మక పత్రాలపై (Digital MoUs) సంతకాలు చేసి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సరికొత్త పునాది వేసింది.
ప్రస్తుతం స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక శాంతి చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే, అటు ఇరాన్ శకానికి రథసారథిగా నిలిచిన అలీ ఖమేనీ అంత్యక్రియల ఉత్సవాలు జరగనుండటంతో ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు ఇరాన్ వైపు మళ్లింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇరాన్ వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.









