
ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఇటలీలో తీసుకొచ్చారు. ప్రముఖ రైలు తయారీ సంస్థ స్టాడ్లర్ అండ్ ఇటాలియన్ రవాణా సంస్థ ARST కలిసి నారో-గేజ్ హైడ్రోజన్ రైలును తాజాగా ఆవిష్కరించాయి. పర్యావరణ పరిరక్షణను, అత్యాధునిక టెక్నాలజీని కలుపుతూ ఈ రెండు సంస్థలు ఈ రైలును రూపొందించాయి. దీంతో గ్లోబల్ రైల్వే రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. కాగా పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ రైళ్లు ఇటలీలోని ప్రాంతీయ రవాణా వ్యవస్థకు సరికొత్త నాంది పలకనుంది.
Worlds First Hydrogen Train
ఈ హైడ్రోజన్ రైళ్లు 2028 నాటికి ఇటలీలో అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిని తీసుకురావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీలీలోని సార్డీనియా ప్రాంతంలో ఎటువైపు చూసినా పెద్ద పెద్ద కొండలు, వంకరటింకర మలుపులు ఉంటాయి. అందువల్ల ఆ ప్రాంతాలలో విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ రైళ్లను నడపడం వంటివి అసాధ్యం. అందువల్ల దీనికి ఒక పరిష్కారం కోసం స్టాడ్లర్ అండ్ ARST సంస్థలు తేలికపాటి మెటీరియల్‌తో.. తక్కువ యాక్సిల్ లోడ్ పట్టేలా నారో-గేజ్ హైడ్రోజన్ ట్రైన్‌ను డిజైన్ చేశాయి.
ఈ రైళ్లు సార్డీనియా ప్రాంతంలోని అల్గెరో ఎయిర్‌పోర్ట్ నుండి మాముంటానాస్ వరకు.. అలాగే ససారి నుండి అల్గెరో, ససారి నుండి సోర్సో ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనున్నాయి. ఈ మార్గాల్లో విద్యుత్ లైన్లు లేకుండానే ఇవి ప్రయాణించనున్నాయి. ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్, ఫ్యూయల్ సెల్స్ సహా హైడ్రోజన్ ట్యాంకులను ట్రైన్ మధ్య పెట్టెలో ఉంచుతారు. దీని కారణంగా ఇది ఒక పవర్ ప్యాక్ బ్యాటరీ ఛార్జర్‌లా పనిచేస్తుంది. హైడ్రోజన్‌ను విద్యుత్ శక్తిగా మార్చి ట్రైన్ బ్యాటరీలను సులభంగా రీఛార్జ్ చేస్తుంది.
ఇలా సార్డీనియాలో ఇలాంటి దాదాపు 10 ట్రైన్‌లను తీసుకొచ్చారు. దీని ద్వారా ఏటా 2,100 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యాన్ని నివారించవచ్చని నిఫుణులు చెబుతున్నారు. రైలు నుంచి కేవలం నీటి ఆవిరి మాత్రమే పర్యావరణంలోకి విడుదల కావడం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని అంటున్నారు. కాగా ట్రైన్‌ల రవాణా కోసం వాడే హైడ్రోజన్‌ను 100 శాతం సోలార్ ఎనర్జీ ద్వారా తయారు చేయడం విశేషం.









