
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ’ పేపర్లు లీకైన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష విధానాల్లో త్వరలో మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే రోజున, ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించేవారు. లక్షలాది మంది విద్యార్థులు ఒకే సమయంలో పరీక్షా కేంద్రాల్లో కూర్చుని ఓఎంఆర్ షీట్లపై బాల్ పాయింట్ పెన్నుతో సమాధానాలను గుర్తించేవారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజు పరీక్ష నిర్వహించడం వల్ల పేపర్ లీకేజీలు, భద్రతా లోపాలు వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ లోపాలను సరిదిద్ది, పరీక్షా ప్రక్రియపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచడం కోసం పాత విధానానికి స్వస్తి చెప్పి సరికొత్త సాంకేతికతను తీసుకురావాలని నిపుణుల కమిటీ సూచించింది.
ఈ ప్రతిపాదనల ప్రకారం భవిష్యత్తులో నీట్ పరీక్షను ఆఫ్‌లైన్ నుంచి పూర్తిగా ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతికి మార్చనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోని కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రశ్నలను చూసి అక్కడే సమాధానాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్షను ఒకే రోజు నిర్వహించకుండా.. 5 నుండి 6 రోజుల పాటు వేర్వేరు షిఫ్టులలో నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారిని వివిధ రోజులుగా విభజించడం వల్ల పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి తగ్గి, పర్యవేక్షణ ఈజీ అవుతుంది.
పలు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రతి షిఫ్టుకు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇస్తారు. అయినప్పటికీ అన్ని పేపర్ల కఠినత్వ స్థాయి ఒకే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా షిఫ్ట్ పేపర్ కష్టంగా వస్తే విద్యార్థులకు నష్టం జరగకుండా ‘మార్కుల సాధారణీకరణ’ చేస్తారు. ఈ కంప్యూటర్ ఆధారిత డిజిటల్ వ్యవస్థ వల్ల పేపర్ లీకేజీల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే.. 2027 నుండి విద్యార్థులు ఆన్లైన్ మాక్ టెస్టులు రాస్తూ కంప్యూటర్ ఇంటర్ఫేస్కు అలవాటు పడాల్సి ఉంటుంది.









