Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Guntur : గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై దుండగుల హల్చల్… పోలీసులపై రాళ్ల దాడి, ఎదురు కాల్పులు

Goons move on railway tracks in Guntur district
Goons move on railway tracks in Guntur district

Guntur : గుంటూరు జిల్లాలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడం, వారిని అడ్డుకున్న రైల్వే పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో దుండగులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే, నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ పాయింట్ వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది గుర్తించారు. వారు సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను కత్తిరించడానికి, ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

పోలీసులు తమను చుట్టుముడుతున్నారని గమనించిన దుండగులు లొంగిపోవడానికి బదులుగా, పోలీసులపైకే రాళ్లతో దాడికి దిగారు. చీకటిని అడ్డుపెట్టుకుని భారీగా రాళ్లు రువ్వడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ దుండగులు వెనక్కి తగ్గకపోవడంతో, జీఆర్పీ పోలీసులు గాలిలోకి 10 రౌండ్ల పాటు కాల్పులు జరపారు. తుపాకీ శబ్దాలతో నిడుబ్రోలు పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. పోలీసుల కాల్పులకు భయపడిన దుండగులు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లోకి, చీకట్లోకి పారిపోయారు.ప్రధాన రైల్వే లైన్ కావడంతో సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేస్తే రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం దొంగతనమా లేక రైల్వే వ్యవస్థను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేసినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో నిడుబ్రోలు స్టేషన్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ మార్గంలో అప్పికట్ల వద్ద గతంలో రైలులో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, సిగ్నల్ వ్యవస్థతో ఆడుకోవడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని పోలీసులు హెచ్చరించారు. రైల్వే ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని, ఇలాంటి కుట్రలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ರೈಲ್ವೇ వ్యవస్థ భద్రతలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని వారు అన్నారు.