
Iran: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు మంగళవారం బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేసినట్లు ఆ దేశ న్యాయస్థానం ప్రకటించింది. సెంట్రల్ ఇస్ఫహాన్‌లోని మలెక్షహర్ నగరంలోని ఒక ప్రజా చౌక్‌లో, ప్రజల సమక్షంలోనే అబోల్ఫజల్ సెపాహి, అమీర్-హుస్సేన్ సఫారీ అనే ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష అమలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
జనవరి 8న జరిగిన నిరసనల సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి, వారిని రోడ్డు సైన్ బోర్డులకు కట్టేసి, ఈడ్చుకెళ్లి, గ్యాసోలిన్ పోసి నిప్పు అంటించారని న్యాయస్థానం నిర్ధారించింది. ఆయుధాలతో దాడికి తెగబడి భయాందోళనలు సృష్టించడం ద్వారా “దేవుడిపై యుద్ధం ప్రకటించడం” (మొహారేబెహ్) , శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించడం వంటి తీవ్రమైన నేరాల కింద వీరికి ఈ శిక్ష విధించారు.
Also Read : టన్నుల కొద్ది బంగారం కొంటున్న చైనా.. ట్రంప్ కు షాకిచ్చే వ్యూహం ఇదేనా?
గత ఏడాది డిసెంబర్ చివరిలో పెరిగిన జీవన వ్యయానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ నిరసనలు, త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి జనవరి 8, 9 తేదీల్లో పరాకాష్టకు చేరాయి. ఈ ఘర్షణల్లో 3,000 మందికి పైగా మరణించగా, అమెరికా, ఇజ్రాయెల్ ప్రోద్బలంతో జరిగిన ఉగ్రవాద చర్యలే ఇందుకు కారణమని ఇరాన్ తెలిపింది. అయితే భద్రతా బలగాలే నిరసనకారులపై కాల్పులు జరిపాయని విదేశీ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నిరసనల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైనిక జోక్యం చేసుకుంటామని హెచ్చరించడం, ఆ తర్వాత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్‌పై దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైంది. ఆ సమయం నుండి ఇరాన్లో అరెస్టులు, ఉరిశిక్షలు గణనీయంగా పెరిగాయి. అమ్యెస్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశం ఇరానే.
Also Read : పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం క్రూరత్వం: కాల్పుల్లో 20 మంది కశ్మీరీల ప్రాణాలు బలి









