
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు పాత స్నేహితుడని, ఇద్దరం కలిసి సంఘ్ పరివార్ విస్తరణకు కృషి చేశామని బీజేపీ ఎంపీ డాక్టర్ నిశికాంత్ దూబే తెలిపారు. పార్లమెంట్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో తనకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, రాహుల్ గాంధీ చెప్పినట్లు చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మంచి ఆలోచనా విధానం ఉందని, ఆయనలో ఎలాంటి తప్పు లేదని దూబే చెప్పుకొచ్చారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అవకాశాలపై రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో దూబే ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను క్రిమినల్ వేస్ట్ అని అభివర్ణించారు. ఉపాధ్యాయులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగ దరఖాస్తు రాయమంటే రాయలేరని సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. తాము ఇంజనీరింగ్ చదివామనే గర్వంతో వారు చిన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయరన్నారు. కానీ ఎలాంటి నైపుణ్యాలను కూడా నేర్చుకోరని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో సీఎంపై ఫైరయ్యారు. సీఎం రేవంత్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి హాజరయ్యారా లేదా ఏదైనా పోటీ పరీక్ష రాశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.









