Konda Surekha : మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో పీసీసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చింది సురేఖ. కాగా ఈ రోజు ఆమెను పలుకరించిన మీడియాకు మరోసారి అదే విషయం వెల్లడించింది. కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసుల అంశంలో తాను చెప్పాల్సింది క్రమశిక్షణ కమిటీకి చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పుడు మీడియాతో మాట్లాడబోనని అన్నారు. ‘‘నేను చెప్పాల్సింది నిన్ననే క్రమశిక్షణ కమిటీకి చెప్పా. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయాలేమీ లేవు. సీఎం రేవంత్‌ విదేశీ పర్యటన నుంచి వచ్చాక మాట్లాడతాను’’అని కొండా సురేఖ సమాధానం ఇచ్చారు. అలాగే త్వరలో అన్ని విషయాలు మాట్లాడుతాన్న సురేఖ, మా ఇంట్లో జరుగుతున్న పూజలో బిజీగా ఉన్నానన్నారు. నిన్ననే అన్ని విషయాలు మాట్లాడా, చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పా. ఇంకా నేను చెప్పేది ఏమిలేదన్నారు.

ఇటీవల వరంగల్‌ జిల్లా గీసుకొండలో కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రికి కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌కు సురేఖ వివరణ కూడా పంపారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. ఈ విషయంలో తనను బాధ్యురాలిని చేయొద్దని అందులో కోరడం తెలిసిందే.

కాగా, కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటను కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకొన్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కుమార్తె చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులివ్వడానికే పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.