తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈమె చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను డిమాండ్ చేయగా సోషల్ మీడియా వేదికగా ఇది వరకే ఓ లేఖను విడుదల చేశారు. అయితే తాజాగా కొండా సురేఖ మరో లేఖను విడుదల చేశారు.

తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఆమె, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి ఒక విజ్ఞప్తి లేఖ రాశారు.

సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులే మీడియా ముందుకు వచ్చి తనపై విమర్శలు చేయడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో గుర్తించాలని సురేఖ డిమాండ్ చేశారు. క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు తాను ఇప్పటికే తగిన వివరణ ఇచ్చానని అన్నారు. ఆమె విచారణ ఇంకా కొనసాగుతుండగానే కొంతమంది నేతలు బహిరంగంగా తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే కుట్రలో భాగమేనా అనే కోణంలో కూడా కమిటీ విచారించాలని కోరారు.

లేఖలో తన ఆవేదనను కొండా సురేఖ వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు, విధానాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై పలువురు నేతలు కలిసికట్టుగా మాటల దాడులకు దిగుతుంటే, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తనపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను పార్టీ నాయకత్వం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తుందని సురేఖ పేర్కొన్నారు. పార్టీ ఆశయాలకు, సైద్ధాంతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తనపై వ్యక్తిగత దాడికి దిగుతున్న నాయకులపై పార్టీ క్రమశిక్షణా నిబంధనల ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి విజ్ఞప్తి చేశారు.