
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోవడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేష్ కారే (34), మోపత్ (42)గా అధికారులు గుర్తించారు. నాలాకు పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగానే కేవలం రెండు నెలల్లో బిల్డింగ్ నిర్మించినట్లు తెలుస్తోంది.
At least two persons were killed and another injured when a multi-storey under-construction building collapsed in Gachibowli here on Saturday, police said.
A fire official involved in the rescue operation told reporters that two bodies had been recovered while clearing the… pic.twitter.com/HiHeu8aQ8U
— The Siasat Daily (@TheSiasatDaily) August 22, 2026
మధ్యాహ్నం సమయంలో భవనం ఒక్కసారిగా నేలమట్టం కావడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దం వచ్చి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరొక అపార్ట్‌మెంట్‌పై పడటంతో అది కూడా కాస్త దెబ్బతిన్నది. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. దాదాపు పది ఫ్లాట్ల వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు కూడా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. అక్రమంగా నిర్మించిన బిల్డింగ్‌లను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, తక్కువ వ్యవధిలోనే నాసిరకంగా నిర్మాణం పూర్తి చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అంటున్నారు. బిల్డర్ సాజిద్ అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.









