AP Home Minister Anitha
AP Home Minister Anitha
AP Home Minister Anitha : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాహ్నవి) అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం (జూన్ 17న) స్వయంగా తుని దొండవాక పంచాయతీ అగ్రహారంలోని ఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌లతో కలిసి ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, దానిని సైతం లెక్కచేయకుండా హోంమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాధితురాలైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. పాప కనిపించకుండా పోవడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిని ఓదార్చి, చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందంటూ ధైర్యం చెప్పారు. రెండేళ్ల పసికందు అదృశ్యం కావడం అత్యంత బాధాకరమని, ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాప ఆచూకీ కనుగొనే వరకు ప్రభుత్వం విశ్రమించదని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కేసులో ప్రభుత్వం లేదా పోలీసులు ఎక్కడా అలసత్వం వహించలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. చిన్నారి మిస్సింగ్ విషయం తెలిసిన వెంటనే యంత్రాంగం అప్రమత్తమైందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతిరోజూ స్వయంగా తానే మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు.కార్యాచరణ: కేవలం టెక్నికల్ ఆధారాలపైనే కాకుండా, క్షేత్రస్థాయిలో (గ్రౌండ్ లెవెల్) ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి అణువణువూ జల్లెడ పడుతున్నాయి.: చిన్నారి ఆచూకీ లభ్యమయ్యే వరకు ఈ గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆమె నొక్కి చెప్పారు.
యూట్యూబ్, సోషల్ మీడియా ఛానళ్లకు గట్టి హెచ్చరిక:
చిన్నారి అదృశ్యం ఘటనను కొందరు తమ స్వార్థానికి వాడుకుంటుండటంపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తూ బాధితులను మరింత కుంగదీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే ఆయా ఛానళ్లు తమ అసత్య ప్రచారాలను నిలిపివేయాలని, లేనిపక్షంలో చట్టపరంగా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హోంమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.