khammam

Khammam :  ఖమ్మం నగరంలో గుండెల్ని పిండేసే తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కన్నబిడ్డలకే ఎలుకల మందు తినిపించి, ఆపై తాను కూడా తిని ఒక తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటనలో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఫాదర్స్ డే నాడే ఆ తండ్రికి కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి, ఏదిలాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి వేదిక్ కుమార్ (7), తనిష్క్ అలియాస్ తనుష్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగరాజు పాల వ్యాపారం చేయడంతో పాటు ఖమ్మంలోని ఒక మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ కుటుంబం ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని పంపింగ్ వెల్ రోడ్ (గాంధీనగర్) లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటోంది.

కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా వీరి మధ్య వివాదం రేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వాతి.. తన ఇద్దరు కొడుకులకు బలవంతంగా ఎలుకల మందు తినిపించింది. ఆ తర్వాత తాను కూడా అదే విషాన్ని తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కొద్దిసేపటికి గదిలో నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూశారు. ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

విగతజీవులుగా మారడంతో

ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు వేదిక్, తనిష్క్ శనివారం రాత్రి కన్నుమూశారు. కళ్లముందే ఆడుకోవాల్సిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారడంతో తండ్రి లింగరాజు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుంటే.. ఈ తండ్రికి మాత్రం తన ఇద్దరు బిడ్డల మరణవార్త వినాల్సి రావడం స్థానికులను తీవ్రంగా చలింపజేసింది. ప్రస్తుతం తల్లి స్వాతి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని, ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.