akhil akkineni
akhil akkineni

అక్కినేని అఖిల్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడి చేతి వేళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని కారణంగా రెండు సర్జరీలు జరిగాయి. అంతేకాకుండా 48 కుట్లు పడ్డాయి. ఈ ఘోర ప్రమాదం గురించి అఖిలే స్వయంగా చెప్పడంతో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంతకీ అఖిల్‌కు అంతటి ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అప్పటికే ఎన్నో ఫెల్యూర్‌లతో సతమతమైన అఖిల్‌కు ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అతడు దాదాపు మూడేళ్ల వరకు సినిమాలకు దూరమయ్యాడు. కనీసం బయట ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో సోషల్ మీడియా మొత్తం అఖిల్ గురించే చర్చ నడిచింది. అఖిల్ కెరీర్ ముగిసిపోయిందని ఎంతో మంది విమర్శలు చేశారు.

అయితే అవన్నీ పట్టించుకోకుండా అఖిల్ ఇప్పుడిప్పుడే మళ్లీ అభిమానుల మధ్యకు వస్తున్నాడు. అతడు నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ఈ నెల 10వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ మొదలు పెట్టగా.. అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను మూడేళ్లుగా ఎవ్వరికీ కనిపించకుండా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించాడు.

Also Read : రానా స్పిరిట్ మీడియా చేతుల్లోకి ‘అమీర్ లోగ్’.. భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్!

ఏజెంట్ మూవీ రిలీజ్ అయిన మూడు నెలలకు తాను బాత్రూంలో జారిపడ్డానని తెలిపాడు. ఆ సమయంలో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో గాజు ముక్కలు తన ఎడమ చేతి వేళ్లకు గుచ్చుకున్నాయని అన్నారు. వెంటనే డాక్టర్లు రెండు సర్జరీలు చేశారని, 48 కుట్లు కూడా పడ్డాయని తెలిపారు. దీని కారణంగా దాదాపు 8 నెలల పాటు ఎలాంటి బరువులు ఎత్తలేకపోయానని, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి తనకు సుమారు 16 నెలలు పట్టిందని చెప్పాడు. మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉండటంతో అభిమానులు తనపై కోపంగా ఉన్నారని, ఇలా మరెప్పుడు జరగకుండా చూసుకుంటానని అఖిల్ హామీ ఇచ్చాడు. దీంతో అఖిల్‌ వ్యాఖ్యలపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఈ వారం థియేటర్, ఓటీటీలో ఫుల్ జోష్.. సినిమాలు, సిరీస్‌లివే..!