Russia : రష్యా నుంచి నేరుగా భారత్‌కు రైల్వే మార్గం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని రష్యా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మార్గం భవిష్యత్తులో రష్యాను హిందూ మహాసముద్రంతో అనుసంధానం చేయడంతో పాటు, భారత్‌కు భూభాగం ద్వారా చేరుకునే అవకాశం కల్పించవచ్చని రష్యా డిప్యూటీ పీఎం మరాట్ ఖుస్నుల్లిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడటం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

అందులో భాగంగా రష్యా నుంచి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసి, మధ్యలో తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మీదుగా భారత్‌కు చేరుకునే అవకాశాన్ని పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. అయితే ఇదే మార్గం ఫిక్స్ కాలేదని, భారత్‌కు చేరుకునే అవకాశం కల్పించే ఏ మార్గమైనా రష్యా పరిశీలించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

Also Read : చైనాను వణికిస్తోన్న డాల్ఫిన్ తుపాన్.. 2230 విమాన స‌ర్వీసులు ర‌ద్దు

ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. రష్యా నుంచి భారత్‌కు రైలు సర్వీసు ప్రారంభం అవుతుందని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ రైల్వే మార్గం భవిష్యత్తులో అమలులోకి వస్తే రష్యాకు కూడా పెద్ద ప్రయోజనం ఉంటుంది. సముద్ర మార్గాలను పూర్తిగా నమ్ముకోకుండా రైళ్ల ద్వారా సరుకులను మధ్య ఆసియా, దక్షిణాసియా మీదుగా భారత్ వైపు తరలించే అవకాశం ఏర్పడుతుంది.

భారత్‌కు కూడా ఇది కీలకమైన పరిణామమే అని చెప్పాలి. రష్యాతో పాటు మధ్య ఆసియా, దక్షిణాసియా దేశాలతో భూభాగం ద్వారా రవాణా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్య సరుకుల రవాణాకు ఈ మార్గం ఉపయోగపడవచ్చు.

అంతేకాదు.. భవిష్యత్తులో నిజంగానే రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే పర్యాటక రంగానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలులో ప్రయాణించే సదుపాయం లేదు. కానీ భవిష్యత్తులో ఈ తరహా భూసంబంధం ఏర్పడితే పర్యాటకులు కూడా రైలు మార్గాన్ని ఉపయోగించే అవకాశం రావచ్చు.

Also Read : కెనడాలో వీసాల కఠినతరం… ఆరు నెలల్లో 3 వేల మంది ఇండియన్స్‌ ఇంటికి

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.