
Konda Surekha : మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా పరకాల నియోజకవర్గం గీసుకొండలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కుమార్తే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై 3 రోజులలోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మాజీమంత్రి చిన్నారెడ్డికి పార్టీ నోటీసులు జారీ చేసింది. ఆయనను కూడా 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదే శించింది. అదే సమయంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు కులాల పేరుతో దూషించినట్లు ఆధారాలు లభించడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
కాగా, పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై అనుసిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కూతురు సుస్మిత విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ విషయమై తెలంగాణ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ PCC ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదిక కోరారు. అదే సమయంలో —కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు పీసీసీ స్పష్టం చేసింది. కాగా, సుస్మిత వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇప్పటికే ప్రకటించారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత మాట్లాడారని రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగతోంది.గతంలోనూ సీఎం రేవంత్‌పై సుస్మిత కాంట్రవర్సీ కామెంట్స్ చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. వరుస వివాదాలతో కొండా ఫ్యామిలీపై హై కమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.









