
Nagarkurnool:తెలంగాణలో ఎల్నీనో ప్రభావంతో సరైన వర్షాలు కురవడం లేదు. కానీ, ప్రజలు అవేం పట్టించుకోకుండా ఏవేవో కారణాలతో యాగాలు, పూజలు, కప్పల పెళ్లిళ్ల పేరుతో హాడావుడి చేస్తున్నారు. కానీ, ఒక గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నంగా వర్షాలు కురవట్లేదని ఏకంగా మూడు నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీశారు గ్రామస్థులు. సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీయడమే కాకుండా తిరిగి దహనం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘటన రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. గ్రామంలో వర్షాలు కురవకపోవడానికి మూడు నెలల కిందట ఖననం చేసిన మృతదేహమే కారణమని భావించిన గ్రామస్థులు ఆ శవాన్ని తిరిగి బయటకు తీసి దహనం చేశారు. వివరాల ప్రకారం…నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడేనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే పనిచేసుకుంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆయన భార్య వదిలి వెళ్లడంతో తన కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, దాదాపు మూడు నెలల క్రితం హైదరాబాద్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్రంగా గాయపడి దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదం అనంతరం పోలీసులు శవపరీక్ష పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు ఆంజనేయులు భౌతికకాయాన్ని స్వగ్రామమైన కోడేనిపల్లికి తీసుకొచ్చి సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా గ్రామంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి గల కారణాలపై గ్రామంలో విపరీతమైన చర్చ మొదలైంది. ఆ చర్చ కాస్తా మూడు నెలల క్రితం చనిపోయిన ఆంజనేయులు మృతి వైపు మళ్లింది. ఆంజనేయులు మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ఆయన మెడలోని పూలదండలు తీయకుండానే పూడ్చిపెట్టారని, అందుకే ఊరికి దోషం తగిలి వర్షాలు పడటం లేదని కొందరు పెద్దలు తేల్చి చెప్పారు. అంతేకాక ఆంజనేయులు కుటుంబ సంప్రదాయం ప్రకారం దహనం చేయాల్సిన వ్యక్తిని ఖననం చేశారని, అందులోనూ మెడలో దండలతో పాతిపెట్టడం వల్లే దేవతలు ఆగ్రహించి వర్షాలు కురిపించడం లేదని గ్రామస్థులు ఒక నమ్మకానికి వచ్చారు. దీనిపై విపరీతంగా చర్చించిన గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు.
మూఢ నమ్మకంతో పూడ్చిపెట్టిన శవాన్ని తిరిగి వెలికితీసి కాల్చేస్తేనే గ్రామానికి పట్టిన అరిష్టం వీడి వానలు కురుస్తాయని నిర్ణయించుకున్నారు. వెంటనే స్మశానవాటిక వద్దకు చేరుకుని, జేసీబీ సహాయంతో ఆంజనేయులును ఖననం చేసిన ప్రదేశాన్ని తవ్వించారు. మూడు నెలల క్రితం పాతిపెట్టిన ఆయన మృతదేహాన్ని బయటకు తీసి, అక్కడే కట్టెలు పేర్చి, పెట్రోల్ పోసి పూర్తిగా దహనం చేశారు. పట్టపగలే గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ చర్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీయడం సరికాదని వారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని అమ్రాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య తెలిపారు. కాగా, ఈ ఘటన కోడేనిపల్లితో పాటు పరిసర గ్రామాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.









