KTR : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కోసం బయలుదేరిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పర్యటనను అడ్డుకునే క్రమంలో పోలీసుల ఆంక్షలు, బీఆర్‌ఎస్ నేతల నిరసనలతో జాతీయ రహదారిపై హైడ్రామా నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మోటర్లను ఆన్ చేయడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, గోదావరి 93.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే చాలు కన్నెపల్లి ద్వారా రైతులకు నీరందించవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా, ప్రాజెక్టులు ఖాళీగా ఉంటూ రైతులు నాట్లు వేయలేకపోతున్న వైనాన్ని ప్రజలకు చూపించడానికే ఈ పర్యటన తలపెట్టినట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్ నుంచి కేటీఆర్ తన భారీ కాన్వాయ్‌తో జనగామ జిల్లాలోకి ప్రవేశించే ముందే కొమ్మాల టోల్‌గేట్ వద్ద పోలీసులు భారీ వ్యూహాన్ని అమలు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడ మోహరించి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల వాహనాలను పూర్తిగా నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న కేటీఆర్‌ను టోల్‌గేట్ దాటకుండా పోలీసులు అడ్డుకున్నారు.టోల్‌గేట్ వద్ద కాన్వాయ్‌ను నిలిపివేయడంపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులను ఒక జిల్లా దాటి మరో జిల్లాకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని ఆయన నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని, వరదలు, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టులను పరిశీలించే హక్కు కూడా లేదా అని పల్లా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

కొమ్మాల దాటిన అనంతరం జనగాం జిల్లా పెంబర్తి వద్దకు కేటీఆర్ కాన్వాయ్ చేరుకోగా, పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచారు. కేటీఆర్ కాన్వాయ్‌లో 40కి పైగా వాహనాలు ఉన్నాయని, కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహించిన గులాబీ పార్టీ నేతలు పోలీసుల బారికేడ్లను తోసేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య నెట్టులాట జరిగి వాతావరణం మరింత వేడెక్కింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ దొంగతనం, చేతగానితనం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే రేవంత్‌రెడ్డి సూచనల మేరకే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏకంగా 7,437 పోస్టులకు అనుమతి

పంటలకు నీళ్లిస్తే మళ్లీ రైతులకు యూరియా ఇవ్వాలి, వడ్లు కొనాలి, మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే నెపంతోనే సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఎండబెడుతున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేసిన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ దుర్మార్గపు వైఖరిని తెలంగాణ రైతాంగానికి కళ్లారా చూపెడతామని అన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో శనివారం రాత్రి నుంచే బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అధికారికంగా స్పష్టం చేశారు. అవసరమైతే పంప్‌హౌస్ గేట్ల వద్దే కేటీఆర్‌ను శాశ్వతంగా నిలిపివేసేందుకు సైతం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కన్నెపల్లి పర్యటనకు వెళ్తుండగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. కాన్వాయ్ వేగంగా వెళ్తుండగా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు, వెనుక భాగాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వాహనాలు ఢీకొన్న ప్రమాద సమయంలో ఒక కారులో ప్రయాణిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటి నాయకులు, సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే కేటీఆర్ తన కాన్వాయ్‌ను నిలిపివేసి కారు దిగారు. గాయపడిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం తీవ్రత పెద్దది కాకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నాయకులంతా కలిసి తిరిగి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరారు.

పెంబర్తి కొమ్మాల టోల్‌గేట్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులను, కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము కచ్చితంగా కన్నెపల్లికి చేరుకుని తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అక్కడ వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల ముందు ఉంచుతామని సవాలు విసిరారు. సర్కార్‌కు దమ్ముంటే మంచి పనులు చేసి ప్రజల మనసు గెలవాలని డిమాండ్ చేశారు.

Also Read : క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు.. BRS పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ !

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.