
Shabad : షాబాద్‌లో ఆరుగురు వ్యక్తుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ దారుణ ఘటన వెనుక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ కేసులో బాధ్యతారహితంగా వ్యవహరించిన షాబాద్ ఎస్సై రమేష్‌ను సస్పెండ్ చేయగా, సీఐ క్రాంతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే పోక్సో కేసు నమోదైనప్పటికీ, అతడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నమోదై 55 రోజులు గడుస్తున్నా కనీసం విచారణ చేపట్టకపోవడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. పోలీసులకు, నిందితుడికి మధ్య సుమారు 20 లక్షల రూపాయల డీల్ కుదిరిందన్న ఆరోపణలు ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గతంలో నిందితుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని బాధితురాలి తల్లి పోలీసులను ప్రశ్నించగా, అసలు నిందితుడు ఎక్కడున్నాడో మీరే చెప్పండి, మేమే పట్టుకుంటామంటూ బాధ్యతారహితంగా సమాధానం చెప్పారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోక్సో కేసులో కూడా నిందితుడికి లాభం చేకూర్చేలా బెయిలబుల్ సెక్షన్లను పెట్టి, అతడిని పోలీసులే కాపాడారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల తీరు వల్లే నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని, వ్యవస్థలోని లోపాల వల్లే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









