పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ తనని తాను ప్రపంచ వేదికలపై ఒక టాప్ శాంతి రాయబారిగా ప్రదర్శించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌లో శాంతి నెలకొనకపోగా.. రక్తపాతం, అంతర్గత హింస తీవ్రస్థాయికి చేరాయి. జూలై 2026 నాటి మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం అసిమ్ మునీర్ పాలనలోని అసలు నమూనాను, ఆయన చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది. గతంలో ఓ దశాబ్దంలో పాకిస్తాన్ అంతర్గత భద్రతా వ్యవస్థ ఎన్నడూ లేనంత దారుణంగా క్షీణించిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

2022లో అసిమ్ మునీర్ పాకిస్తాన్ సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన సమయానికి దేశంలో తీవ్రవాదం, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతాలలో అశాంతి నెలకొంది. అలాగే ఆఫ్గానిస్తాన్‌లో కూడా ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ సమస్యలను మునీర్ చర్చల ద్వారా పరిష్కరించలేదు. తీవ్రమైన సైనిక చర్యలు, అరెస్టులు, సరిహద్దు దాడులు, కేంద్రీకృత ఆంక్షల ఆధారంగా పనిచేసే భద్రతా విధానాన్ని ఎంచుకున్నారు. కానీ ఈ విధానం పూర్తిగా విఫలమైంది. దీంతో ఉగ్రవాద దాడులు, పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు రెట్టింపు అయ్యాయి.

పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదికల ప్రకారం.. మునీర్ హయాంలో ఉగ్రవాద దాడులు ఊహించని రీతిలో పెరిగాయి. 2022లో 380గా ఉన్న ఉగ్రదాడుల సంఖ్య 2023లో 645కి, 2024లో 908కి చేరి, 2025 నాటికి ఏకంగా 1,066కి పెరిగింది. వీటి ప్రకారం 2014 తర్వాత అత్యధిక ఉగ్రదాడులు, 2011 తర్వాత భద్రతా బలగాల అత్యధిక మరణాలు, 2015 తర్వాత అత్యంత ఎక్కువ సంఖ్యలో పౌరుల మరణాలు నమోదైన సంవత్సరంగా 2025 నిలిచింది. 2025లో మునీర్ ఫీల్డ్ మార్షల్‌గా నియమితులయ్యారు. అయినా కానీ భద్రతాపరమైన ఫలితాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని తెలుస్తోంది.

విదేశాల్లో కాల్పుల విరమణ, చర్చలు, ఇరాన్-అమెరికాలాంటి దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే శాంతిదూతగా మునీర్ తన వాల్యూను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ స్వదేశంలో మాత్రం సైన్యం ఒత్తిడి, ఆంక్షలు, బలవంతపు అదృశ్యాలు, సామూహిక శిక్షలను ఆశ్రయిస్తోంది. తమ బలూచ్, పష్తూన్, ఆక్రమిత కశ్మీర్ పౌరులకు ఎలాంటి రాజకీయ స్వేచ్ఛను ఇవ్వడంలో సైనిక నాయకత్వం విఫలమైంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ పరిస్థితి దారుణంగా మారింది. రావల్కోట్, ముజఫరాబాద్‌లలో ప్రజలు తమ ప్రాథమిక ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేసిన నిరసనలపై కూడా మునీర్ ప్రభుత్వం తీవ్ర నిరంకుశత్వాన్ని ప్రదర్శించి, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఆ కమిటీని నిషేధించింది. అయితే పాక్‌లో మీడియాను అణచి వేసేందుకు మునీర్ ముఖ్య పాత్ర వహించారని తెలుస్తోంది