అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరు దేశాలు ఇప్పటికే ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఏదైనా నౌకపై ఇరాన్ గనక ఇకపై దాడికి పాల్పడితే.. ఆ దేశంలో ఉన్న కీలక వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై బాంబులతో విరుచుకుపడతామని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా భయంకరమైన దాడులు చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు.

గతంలో పికాక్స్ పర్వతాన్ని ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించడంతో.. ఇరాన్ కూడా తన సైనిక చర్యలను మరింత ముమ్మరం చేసింది. పికాక్స్ పర్వత వ్యవహారాన్ని సాకుగా చూపిస్తూ అమెరికా మరిన్ని దాడులకు దిగుతోందని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా జోర్డాన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను తమ సైన్యం విజయవంతంగా అడ్డుకుందని జోర్డాన్ మిలిటరీ వెల్లడించింది.

మరోవైపు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు కూడా ఈ యుద్ధ వాతావరణంలోకి ప్రవేశించారు. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన చమురు నౌకలను దిగ్బంధిస్తామని వారు హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి కీలక నౌకా రవాణా మార్గాల్లో నెలకొన్న భయాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.