Exclusive : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని రావల్‌కోట్‌లో ప్రాథమిక వసతులు, హక్కుల కోసం స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇప్పుడు ఒక భారీ తిరుగుబాటుగా మారింది. జాయింట్ పబ్లిక్ యాక్షన్ కమిటీ (JPAC) ఆధ్వర్యంలో వేలాది మంది స్థానికులు వీధుల్లోకి వచ్చి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న నిరాయుధులైన పౌరులపై పాక్ సైన్యం నేరుగా కాల్పులు జరుపుతోందని, అంతేకాకుండా ఈ నరమేధం ఆధారాలను తుడిచిపెట్టేందుకు అమరులైన యువకుల మృతదేహాలను కూడా ఆర్మీ కిడ్నాప్ చేసి మాయం చేస్తోందని స్థానికులు అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

Also Read : దూసుకొస్తున్న హీట్ డోమ్.. నిప్పుల కొలిమిలా మారనున్న భారత్.. వినాశనం తప్పదా?

మృతదేహాలను మాయం చేస్తున్న మునీర్ సైన్యం

పీఓకే నుంచి అందుతున్న అంతర్గత నివేదికలు పాక్ ఆర్మీ క్రూరత్వాన్ని ప్రపంచం ముందు ఉంచుతున్నాయి. రావల్‌కోట్‌లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకోగా, వేలాది మంది పౌరులు చేతుల్లో మషాల్‌లు (చేతి దివిటీలు) పట్టుకుని రాత్రి వేళల్లో రోడ్లపైకి వస్తున్నారు. పిండి, విద్యుత్ వంటి కనీస అవసరాలను అడుగుతున్న జనంపై పాక్ రేంజర్లు, సైన్యం బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ మీడియాకు, ప్రపంచ దేశాలకు ఈ నరమేధం నిజాలు తెలియకుండా దాచడానికే సైన్యం మృతదేహాలను ఎత్తుకెళ్తోందని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. “మా కళ్లెదుటే మా పిల్లలను కాల్చి చంపడమే కాకుండా, ఆ శవాలను కూడా వాళ్లే తీసుకెళ్లిపోతున్నారు” అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ పాలకులు రేపిన ఈ ‘ద్వేషం’ నుంచే భయంకరమైన ‘ప్రతీకారం’ పుడుతుందని అచటి ప్రజలు హెచ్చరిస్తున్నారు.

పాక్ ఆర్మీ దాడుల మధ్య, ఈ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ యాక్టివిస్ట్, అడ్వకేట్ సాద్ అన్సారీ చేసిన ప్రసంగం ఇటు ఇస్లామాబాద్‌ను, అటు రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. కాల్పులు, లాఠీ ఛార్జీలను ఎదుర్కొంటూ నిలబడిన కాశ్మీరీ ప్రజల మధ్య ఆయన నిలబడి.. “ఇక నీరు తల దాటిపోయింది, కాశ్మీరీలు ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదు” అని స్పష్టం చేశారు.”ఈ రక్తపిపాసి సైన్యం ముందు పోరాడటానికి మీరు సిద్ధమేనా?” అని సాద్ అన్సారీ అడగ్గా, అక్కడ చేరిన వేలాది మంది జనం ఒక్కసారిగా చేతులెత్తి తిరుగుబాటు నినాదాలు చేశారు. పాకిస్తాన్ అగ్రనేతలు గతంలో ముజఫరాబాద్ వచ్చినప్పుడు ‘కాశ్మీరీలు ఎప్పటికీ పాకిస్తాన్‌ను పడనీయరు’ అని చెప్పామని, అయితే దాని అర్థం తమ ప్రాథమిక హక్కులను తాకట్టు పెడతామని కాదని అన్సారీ ఆవేశం కట్టలు తెంచుకున్నారు. ఇద్దరు ముగ్గురు పెద్ద అధికారులు, నేతలు తమ అహాన్ని పక్కనబెట్టి శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే, వారు నాటిన ఈ ద్వేషమే ఇరు దేశాలను ముంచేస్తుందని హెచ్చరించారు.

పాక్ సైన్యానికి ఎదురొడ్డి నిలుస్తున్న నిరసనకారులు తాము కేవలం రోడ్లకే పరిమితం కాబోమని, స్థానిక కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీలలో కూర్చున్న నేతల నియంతృత్వానికి ముగింపు పలుకుతామని తేల్చిచెప్పారు. పేద ప్రజలు కడుపు కట్టుకుని కట్టే పన్నులతో ఇక్కడి డిప్యూటీ కమిషనర్ (DC), సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), కమిషనర్లు జేబులు నింపుకుంటున్నారని, ఇకపై ప్రజలే వారి కాలర్ పట్టుకుని పైసా పైసాకు లెక్క అడుగుతారని అన్సారీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలిచి పెద్ద పెద్ద కార్లలో తిరిగే నాయకులు తమ బాధ్యతలను మరిచారని, ఇక్కడ సామాన్యుడు రెండు పూటల కూటికి తలప్రాణం తోకకు వస్తుంటే, అధికారులు మాత్రం విలాసాల్లో మునిగిపోతున్నారని మండిపడ్డారు.

Also Read : గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్.. ఈ మిస్టేక్ చేస్తే అమెరికా నుంచి బహిష్కరణ?

‘ప్రపంచం మా వైపు చూడాలి’ – అంతర్జాతీయ సమాజానికి పీఓకే ప్రజల విన్నపం

రావల్‌కోట్ ధర్నాలో కూర్చున్న కాశ్మీరీల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. పీఓకే బ్యాంకింగ్ వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని, అక్కడి స్థానిక ‘AJK బ్యాంక్’కు పూర్తిస్థాయి షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా కల్పించాలని తద్వారా స్థానికుల ఆర్థిక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.పాక్ సైన్యం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని ఉద్యమకారులు కోరుతున్నారు. గ్లోబల్ మీడియా, ఐక్యరాజ్యసమితి (UN), అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంస్థలను సాద్ అన్సారీ నేరుగా పీఓకేకు ఆహ్వానించారు. వివిధ దేశాల పార్లమెంట్ల ముందుకు వెళ్లి పీఓకే ప్రజలపై పాక్ ఆర్మీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ స్వేచ్ఛ, హక్కుల రక్షణ కోసం చివరి శ్వాస వరకు పోరాడుతాం తప్ప ఒక ఇంచ్ కూడా వెనక్కి తగ్గబోమని పీఓకే అవామ్ (ప్రజలు) తెగేసి చెబుతున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.