
Houthis Attacks : పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఎర్రసముద్రం (Red Sea), హర్మూజ్ జలసంధి ప్రాంతాలు యుద్ధ మేఘాలతో అల్లకల్లోలంగా మారాయి. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారైన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ‘ఎన్సేలియా’ (ENCELIA), ‘లైలా’ (LAYLA) అనే రెండు నౌకలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, విస్ఫోటన డ్రోన్లతో ఈ దాడులకు పాల్పడినట్లు హౌతీ దళాలు ప్రకటించాయి.
A Saudi oil tanker has caught fire after reportedly being struck around 70 kilometres north of the Yemeni border, with the Houthis later claiming large scale operations are underway. pic.twitter.com/l1d8CVNf3p
— Ticker (@tickercotweets) July 23, 2026
ఇటీవల యెమెన్ రాజధాని సనా (Sanaa) విమానాశ్రయంపై సౌదీ దళాలు నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ సైనిక చర్య చేపట్టినట్లు హౌతీ దళాల అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరియా (Yahya Saree) తెలిపారు. తమ దాడి ధాటికి నౌకల్లో భారీగా మంటలు చెలరేగాయని, ఈ భయంతో మరో 10 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి మళ్లాయని ఆయన వెల్లడించారు. ఈ దాడులపై సౌదీ అరేబియా రవాణా శాఖ (TGA) స్పందిస్తూ.. ‘ఎన్సేలియా’ నౌక ముందు భాగంపై దాడి జరిగి మంటలు చెలరేగిన మాట వాస్తవమేనని, అయితే నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. గత 12 ఏళ్లుగా సౌదీ అరేబియా తమపై అక్రమ దిగ్బంధనాన్ని ప్రయోగిస్తోందని, దానికి సమాధానంగా తాము సౌదీ నౌకలపై ‘సముద్ర దిగ్బంధనం’ విధిస్తున్నామని, మళ్లీ దాడికి తెగబడితే సౌదీ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారీ సైనిక చర్యలు చేపడతామని హౌతీలు స్పష్టం చేశారు.
Yemen Houthis claim strikes on Saudi oil tankers in Red Sea.
The Houthis said in a statement posted on Telegram that they-
Carried out a qualitative military operation targeting two Saudi oil tankers that violated the blockade – naming the vessels as the Encelia and the Layla. pic.twitter.com/zJh327OfXu
— News Arena India (@NewsArenaIndia) July 23, 2026
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తోడు ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ విరుచుకుపడటంతో అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద విఘాతం కలిగింది. ఎర్రసముద్రం ద్వారా జరిగే నౌకాయానం ప్రమాదంలో పడటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా మండిపోతున్నాయి.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హౌతీలు దాడులకు పాల్పడితే దానికి ఇరాన్ ప్రతినిధులుగా ఉన్న టెహ్రాన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హౌతీల చర్యలకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అవసరమైతే ఇరాన్‌పై నేరుగా బలమైన సైనిక చర్య చేపడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టేందుకు గతంలో అమెరికా బలగాలు హౌతీలకు గట్టి బుద్ధి చెప్పాయని, అప్పటి నుంచి వారు కొంతవరకు నియంత్రణలోనే ఉన్నారని ట్రంప్ గుర్తుచేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు మళ్లీ సౌదీ నౌకలపై దాడులు మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12న అమెరికా బలగాలు ఇరాన్‌పై జరిపిన దాడికి ప్రతీకారంగానే తాము ఈ చమురు నౌకలను దెబ్బతీసినట్లు హౌతీలు ప్రకటించడం గమనార్హం.
మరోవైపు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలను, నావికులను బెదిరించేందుకు ఇరాన్ , దాని మద్దతుదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే తమ దళాలు పశ్చిమాసియా ప్రాంతంలో వ్యూహాత్మక దాడులు నిర్వహిస్తున్నాయని, అంతర్జాతీయ జలాల్లో నౌకల రక్షణే తమ ప్రాధాన్యత అని వెల్లడించింది.ప్రపంచంలోనే అతిముఖ్యమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై మళ్లీ పూర్తి పట్టు సాధించేందుకు, నౌకల రాకపోకలు సజావుగా సాగేలా చూసేందుకు అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో శాంతి భద్రతలను పునరుద్ధరించి, తమ పట్టును నిలుపుకుంటామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధీమా వ్యక్తం చేసింది.









