
H1b abuse act bill : అమెరికాలో ఉద్యోగం, ఉన్నత చదువులు సాధించాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ నిపుణులకు భారీ షాక్ తగిలింది. హెచ్-1బి వీసా ప్రక్రియలో పారదర్శకత పెంచడం, దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ (Tim Sheehy) ‘ఎండ్ H-1B అబ్యూజ్ యాక్ట్’ (End H-1B Abuse Act) పేరిట ఒక నూతన బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఈ నూతన హెచ్-1బి (H-1B) వీసా బిల్లు, విదేశీ నిపుణులు ,భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అమెరికా స్థానిక కార్మికుల ప్రయోజనాలను కాపాడటం, జాతీయ భద్రతను పటిష్టం చేయడమేనని సెనేటర్ టిమ్ షీహీ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ శ్రామికులను భర్తీ చేయడాన్ని అడ్డుకోవడమే ఈ ప్రతిపాదనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
బిల్లులోని అత్యంత కఠినమైన ప్రతిపాదన ప్రకారం, హెచ్-1బి ప్రోగ్రామ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కొత్త హెచ్-1బి వీసాల జారీపై మూడేళ్ల పాటు (3 Years Pause) పూర్తి విరామం విధించాలని కోరారు. ఈ మూడేళ్ల సమయంలో ప్రోగ్రామ్‌లోని లొసుగులను సరిదిద్ది, కొత్త నిబంధనలతో తిరిగి తీసుకురావాలని ప్రతిపాదించారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ర్యాండమ్ లాటరీ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని బిల్లు సూచిస్తోంది. దానికి బదులుగా అత్యధిక వేతనం (Wage-based selection) పొందే విదేశీ అభ్యర్థులకే ప్రాధాన్యతనిచ్చి వీసాలు కేటాయించాలని, వార్షిక కోటా పరిమితిని మరింత కఠినతరం చేయాలని పేర్కొన్నారు.
భారతీయ ఐటీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా థర్డ్-పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల మోడల్‌పై పూర్తి నిషేధం విధించాలని ప్రతిపాదించారు. ఐటీ కాంట్రాక్ట్ కంపెనీల ద్వారా అమెరికాకు ఉద్యోగులను పంపించే విధానానికి దీనివల్ల పెద్ద గండి పడనుంది.
కుటుంబ వ్యవస్థ ఆధారిత వీసాలపై కూడా ఈ బిల్లు తీవ్ర నిబంధనలను మోపింది. హెచ్-1బి వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకెళ్లే సదుపాయాన్ని నిలిపివేయడంతో పాటు, శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డ్) మార్గం సుగమం చేసే ‘డ్యూయల్ ఇంటెంట్’ (Dual Intent) హక్కును కూడా రద్దు చేయాలని కోరారు.
అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఆసరాగా నిలిచే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉండి తాత్కాలిక పని అనుమతులు పొందే వెసులుబాటు దీనివల్ల కోల్పోతారు.
వీసాలపై గతంలో అమెరికా ప్రభుత్వం నిర్దేశించిన $100,000 (సుమారు రూ.97 లక్షలు) భారీ రుసుమును శాసనబద్ధంగా పునరుద్ధరించాలని సెనేట్ బిల్లులో పేర్కొన్నారు. ప్రతిపాదనలన్నీ చట్టరూపం దాల్చితే కంపెనీలపై ఆర్థికంగాను, పరిపాలనాపరంగాను తీవ్ర భారం పడుతుంది.
గతంలో రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్ కూడా ప్రతినిధుల సభలో ఇలాంటి ప్రతిపాదనలే చేశారు. ఏటా ఇచ్చే 85,000 వీసాల పరిమితిని తగ్గించడం, డిపెండెంట్లను అనుమతించకపోవడం వంటి అంశాలను అందులో చేర్చారు.
మరోవైపు, హెచ్-1బి వీసా రుసుమును $100,000కి పెంచుతూ గతంలో ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి అమెరికా అప్పీల్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ ఫీజు పెంపును చట్టవిరుద్ధమైన పన్నుగా భావిస్తూ కొట్టివేసిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నిరాకరించింది.
కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు అంతటి భారీ ఫీజును సవరించే అధికారం లేదని, ఈ నిర్ణయం వల్ల దేశానికి జరిగే అత్యవసర నష్టాన్ని నిరూపించడంలో ప్రభుత్వం విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా న్యాయస్థానాలు ట్రంప్ సర్కార్ నిర్ణయాలకు అడ్డుకట్ట వేసినట్లయింది.
ప్రస్తుతం సెనేట్‌లో ప్రవేశపెట్టిన ‘ఎండ్ H-1B అబ్యూజ్ యాక్ట్’ కేవలం ఒక ప్రారంభ బిల్లు మాత్రమే. ఇది చట్టంగా మారాలంటే అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ ఆమోదం పొంది, ఆపై అధ్యక్షుడి సంతకం కావాల్సి ఉంటుంది. భారతీయ ఐటీ రంగానికి (TCS, Infosys, Wipro వంటివి),అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది ఆందోళనకర విషయమే అయినప్పటికీ, వెంటనే అమలులోకి వచ్చే అవకాశం లేదు.









