
wildfire : ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ కార్చిచ్చు (Wildfire) తీవ్రస్థాయిలో చెలరేగింది. అనూహ్యంగా ప్రారంభమైన ఈ మంటలు ఈదురుగాలుల ధాటికి అతి వేగంగా పక్కనే ఉన్న జనావాసాలకు, అడవులకు వ్యాపిస్తున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, పొడిగాలులు వీస్తుండటంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. భారీగా ఎగసిపడుతున్న మంటల కారణంగా ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసి గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ఇరు దేశాల అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.
⚡️⭕️ More than 200,000 people have left their homes due to unprecedented wildfires across France and Spain, European media reports. (IRIB News) pic.twitter.com/NWwhV4G4h3
— Middle East Observer (@ME_Observer_) July 25, 2026
ఈ విపత్తు తీవ్రత దృష్ట్యా రెండు దేశాల ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫ్రాన్స్, స్పెయిన్ రక్షణ దళాలు (సైన్యం) నేరుగా రంగంలోకి దిగాయి. మిలిటరీ హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల ద్వారా ఆకాశం నుంచి కొన్ని వేల లీటర్ల నీటిని మంటలపై గుమ్మరిస్తూ కార్చిచ్చును అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంటల తీవ్రత నానాటికీ పెరుగుతుండటంతో స్పెయిన్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించింది. ముఖ్యంగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మంటలు నియంత్రణ రేఖ దాటిపోవడంతో అక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఊహించని విపత్తును ఎదుర్కొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ యూరోపియన్ యూనియన్ (EU) సహాయాన్ని కోరారు. కాగా, ఈ ఘోర ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్న స్పానిష్ పోలీసులు.. శుక్రవారం ఒక ట్రాక్టర్ డ్రైవర్ అటవీ ప్రాంత సమీపంలో అంటించిన చిన్న మంటలే ఈ భారీ కార్చిచ్చుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
ఈ కార్చిచ్చు కారణంగా పర్యావరణానికి, స్థానిక వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగ ప్రభావం పక్క జిల్లాలకు కూడా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ సూచించింది. యూరోపియన్ యూనియన్ నుంచిదనపు సహాయక బృందాలు, విమానాలు చేరుకుంటే తప్ప ఈ మంటలను పూర్తిగా అదుపు చేయడం సాధ్యపడకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల దళాలు శ్రమిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.









