Attack on Telangana police : ఓ చోరీ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు మహారాష్ట్రకు వెళ్లిన ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌ హత్నూర్‌ పోలీసులపై మహారాష్ర్టలో స్థానికులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమవగా పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చోరీ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ బకర్ అలియాస్ జాఫర్‌ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతను మహారాష్ర్టలో ఉన్నాడని తెలుసుకుని పట్టుకునేందుకు బజార్‌హత్నూర్ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఆగస్టు 30న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‌ ప్రాంతానికి వెళ్లారు.

కిన్వట్ ప్రాంత పోలీసుల సహకారంతో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న షేక్ బాకర్ అలియాస్ షేక్ జాఫర్ (45)ను పోలీసులు ఓ హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతులకు సంకెళ్లు వేసి ఓ ప్రైవేటు వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. ఈ విషయం అతడి బంధువులకు, గ్రామస్థులకు తెలిసింది. దీంతో వాహనం చిఖిలి ఫాటా వద్దకు చేరుకోగానే సుమారు 50 నుంచి 60 మంది పురుషులు, మహిళలతో కూడిన గుంపు పోలీసుల వాహనాన్ని చుట్టుముట్టారు. కర్రలు, రాళ్లతో వాహనం పై దాడి చేయడంతో వాహనం ధ్వంసమైంది. ఈ దాడిలో ఎస్సై రమేష్ తలకు కూడా గాయమైంది.

ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆత్మరక్షణ కోసం బజార్‌హత్నూర్ ఎస్సై గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ గందరగోళంలో నిందితుడు షేక్ బకర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంచలన ఘటనపై బజార్‌హత్నూర్ పోలీసులు కిన్వట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం మహారాష్ట్ర పోలీసుల సహాకారంతో ప్రత్యేక బలగాలతో చిక్లీ గ్రామానికి వెళ్లి గాలింపు చేపట్టి, తప్పించుకున్న నిందితుడు షేక్ బకర్‌ను తిరిగి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు మహారాష్ట్ర ఛానళ్లలో ప్రసారం కావడంతో బజార్‌హత్నూర్ పోలీసుల పై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.