
CM Revanth Reddy : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యారేజీలలో నీటి నిల్వ , నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రచారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో (చిట్‌చాట్) ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు తీవ్ర కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీరు నింపకూడదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. “కళ్లముందు నీరు పారుతుంటే ఎత్తిపోయవచ్చు కదా” అని బీఆర్ఎస్, ఈటల రాజేందర్ అడుగుతున్న ప్రశ్నలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. పారుతున్న నీటిని ఆపి నిల్వ చేస్తేనే ఎత్తిపోతలకు సాధ్యమవుతుందని, 93.5 మీటర్ల మట్టంలో నీటిని నిలిపితే తప్ప కన్నెపల్లి వద్ద ఎత్తిపోత సాధ్యం కాదని తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచనలను పక్కనబెట్టి నీటిని నింపడం తీవ్ర ప్రమాదకరమని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ఈటల అంటే తమకు గౌరవమే ఉన్నప్పటికీ, కాళేశ్వరం విషయంలో ఆయన అసత్యాలు మాట్లాడి ఆ గౌరవాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఈటల మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక జాతీయ పార్టీ ఎంపీగా ఉండి, బీఆర్ఎస్ నేతల వాదనను వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. హరీశ్ రావు సూచనలకు గుడ్డిగా మద్దతు తెలుపుతూ ఈటల తన ప్రామాణికతను దెబ్బతీసుకున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ లోపాలు బయటపడ్డాయని, ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే (2020 మే 18న) నాటి ఈఈ రమణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బ్యారేజీలో ఉన్న సాంకేతిక లోపాలను వెంటనే సరిదిద్దాలని ఇంజినీర్లు మొత్తుకున్నా, నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మొదట్లోనే హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్డీఎస్ఏ ఈ లోపాలపై ప్రాథమిక ,తుది నివేదికలను సమర్పించిందని సీఎం వివరించారు. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం ,నిర్వహణ—ఈ నాలుగు విభాగాల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు నివేదిక తేల్చిచెప్పిందన్నారు. అంతేకాకుండా, 2022 జూలై 14న వచ్చిన భారీ వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ పూర్తిగా మునిగిపోయిందని, అది ఇప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
ప్రాజెక్టుల భద్రత కోసం కేంద్రం 2021లో తెచ్చిన చట్టం ప్రకారమే ఎన్డీఎస్ఏ స్వతంత్రంగా పనిచేస్తోందని తెలిపారు. సీడబ్ల్యూసీ (CWC) , ఎన్డీఎస్ఏ నిపుణుల సలహాల మేరకే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. “80 వేల పుస్తకాలు చదివామని చెప్పుకునే మేధావుల మాటలు కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడిన ఖిలాడీ కమిటీల సూచనలు కానీ పట్టించుకోవద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది” అని ఎద్దేవా చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టులపై అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు ప్రాథమిక అవగాహన కూడా లేకపోవడం విచారకరమన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీల ప్రతిపాదనలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకటి సాంకేతిక నిపుణులతో కూడిన ‘ఎన్డీఎస్ఏ కమిటీ’ అయితే, రెండోది అబద్ధాలను ప్రచారం చేసే ‘కిలాడీ కమిటీ’ అని అభివర్ణించారు. ఈ కిలాడీ కమిటీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు , ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్నారని విమర్శించారు. నిపుణుల కమిటీ సూచనలను కాదని, ఈ రాజకీయ కమిటీ మాటలు వింటే తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు, విపక్షాలు తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని సీఎం ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 2019 జూన్ 21న కాళేశ్వరాన్ని ఆర్భాటంగా ప్రారంభించారని, కానీ ఐదేళ్లలోనే అది కుప్పకూలే స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల సొమ్మును వృథా చేసిన నాటి పాలకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బ్యారేజీల పునరుద్ధరణ ,తదుపరి చర్యలపై తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, బ్యారేజీల స్థిరత్వాన్ని పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రాణాలను, వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలో పడేసే ఏ పనీ చేయబోమని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలియజేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాళేశ్వరం పునరుద్ధరణను అత్యంత శాస్త్రీయంగా, చట్టబద్ధంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం ముగించారు.









