తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త సంక్షేమ పథకాలతో ముందుకు వచ్చింది. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మూడు రకాల కీలక పథకాలకు అర్హులైన క్రైస్తవుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ రావు తెలిపారు.

మొదటగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఉపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించుకుని ఆర్థికంగా స్థిరపడాలనుకునే వారి కోసం రూ.50,000 వరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. వీటితో పాటు డ్రైవర్ సాధికారత పథకం కింద అర్హులైన వారికి ఈ-బైక్‌లు, పెట్రోల్ బైక్‌లు లేదా స్కూటీలను పంపిణీ చేస్తారు.

ఇందిరా మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే డ్రైవర్ సాధికారత పథకం కింద వాహనాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. ఇక ఆదాయం విషయానికి వస్తే దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కేవలం అర్హతలు, అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగానే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోగా tgobmms.cgg.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ దరఖాస్తు ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్నా, లేదా ఏయే సర్టిఫికెట్లు కావాలో తెలుసుకోవాలన్నా జనగామ జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఉన్న జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని అభ్యర్థులు నేరుగా సంప్రదించవచ్చు. అదనపు సమాచారం, ఇతర వివరాల కోసం 040-29801130 అనే ఫోన్ నంబర్‌కు కాల్ చేసి మాట్లాడవచ్చునని అధికారులు తెలిపారు.