Bengaluru :  బెంగళూరులో నివసించే ఓ మహిళా టెక్కీకి జరిగిన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. పార్శిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఒక డెలివరీ ఏజెంట్, ఆమె పదేపదే నిరాకరించినా వినకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి, ఆపై తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో సదరు మహిళ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బాధిత మహిళ సోషల్ మీడియాలో పంచుకున్న వివరాల ప్రకారం.. డెలివరీ ఏజెంట్ ఆమె ఇంటికి పార్శిల్ తీసుకువచ్చాడు. పార్శిల్ ఇచ్చిన తర్వాత, తనకు అత్యవసరమని, ఇంట్లోని టాయిలెట్ వాడుకోవాలని ఆమెను కోరాడు. కానీ, అపరిచితులను ఇంటి లోపలికి అనుమతించనని ఆమె సున్నితంగా, స్పష్టంగా తిరస్కరించారు. ఒకవేళ అంతగా అవసరమైతే పక్కనే ఉన్న మగవారిని సహాయం కోరాలని సూచించినప్పటికీ, ఆ వ్యక్తి ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె అభ్యంతరాలను లెక్కచేయకుండా, తన చెప్పులు విడిచి మరీ బలవంతంగా ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు.

వాష్‌రూమ్ వాడి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన అసలు రంగు బయటపెట్టాడు. తన ప్రైవేట్ భాగాలను ఆమెకు చూపిస్తూ అత్యంత అసభ్యంగా ప్రవర్తించడంతో సదరు మహిళ షాక్‌కు గురయ్యారు. తాను తన సొంత ఇంట్లోనే ఇంతటి అభద్రతా భావానికి లోనవుతానని ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ నో అని చెబితే అది అంతటితో ముగిసిపోవాలని, ఎవరికీ మరొకరి వ్యక్తిగత గోప్యతను, సరిహద్దులను అతిక్రమించే హక్కు లేదని ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటన జరుగుతున్న సమయంలో తన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని ఆమె తీవ్రంగా భయపడ్డారు. తన ఫోన్ కెమెరాను ఆన్ చేసి ఉంచి, ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచారు. ఒకవేళ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే బయటకు పరుగెత్తి ఇతరుల సహాయం కోరాలని ఆమె ప్లాన్ చేసుకున్నారు. రోజువారీ వార్తల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వింటున్న తాను, స్వయంగా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆమె వాపోయారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో, బెంగళూరులోని మారతహళ్లి పోలీసులు స్పందించారు. బాధిత మహిళను సంప్రదించి, ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నగరాల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డెలివరీ ఏజెంట్ల నేపథ్యాన్ని సరిగ్గా తనిఖీ చేయాలని, కంపెనీలు ఇలాంటి విషయంలో బాధ్యత వహించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.