ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంత్యక్రియల్లో ముఖానికి ముసుగు వేసుకుని వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. బేస్‌బాల్ క్యాప్ పెట్టుకుని, ముఖానికి నల్లటి మాస్క్ ధరించిన ఆ వ్యక్తికి అక్కడ ఉన్నవారు కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు. చివరికి ఖమేనీ కుటుంబానికి చెందిన ఒక పసిబిడ్డ మృతదేహాన్ని ఉంచిన పెట్టెను (బాక్సును) కూడా ఆ ముసుగు మనిషే మోయడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దీంతో ఆ ముసుగు వెనుక ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరేమో ఆయన అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ అయిన ‘మొజ్తబా ఖమేనీ’ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. తన తండ్రి అంత్యక్రియలకు ఆయన ఇలా రహస్యంగా హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ముసుగులో ఉన్న వ్యక్తి మొజ్తబా ఖమేనీ కాదని, అలీ ఖమేనీ పెద్ద మనవడైన ‘మహమ్మద్ జావెద్ ఖమేనీ’ అని అంటున్నారు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు ముస్తఫా కొడుకే ఈ జావెద్.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఖమేనీ కాంపౌండ్‌పై అమెరికా దళాలు భారీ దాడి చేశాయి. ఆ దాడిలో జావెద్ శరీరం తీవ్రంగా కాలిపోయిందని, అందుకే ఆయన ముఖానికి ముసుగు ధరించి అంత్యక్రియలకు వచ్చారని సదరు పత్రిక తెలిపింది. అదే అమెరికా దాడిలో ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ముసుగు మనిషి గురించి ఇరాన్ ప్రభుత్వం కానీ, అక్కడి అధికారిక వర్గాలు కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తాజాగా స్పందించారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన వారిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనేది ఇరాన్ దేశ ప్రజలందరి డిమాండ్ అని, ఆ డిమాండ్‌ను తాను ఖచ్చితంగా నెరవేరుస్తానని మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు.