
Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం వల్ల రుతుపవనాలు బలమయ్యాయి. దీనిప్రభావంతో తీరప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే వీలుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయి.
Also Read : కొడుకును ఒంటరిగా వదిలి.. గోదావరిలోకి దూకిన దంపతులు
హైదరాబాద్‌లో ఉదయం నుంచి చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఆకస్మిక జల్లుల వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడవచ్చు. రాయలసీమ జిల్లాల్లో సాధారణంగా పొడి వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశముంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున జాలర్లు వేటకు వెళ్లవద్దని, రైతులు ఉరుముల సమయంలో చెట్ల కింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Also Read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందంటే?









